శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మనకి ఏదైనా రాసి పెట్టి వుంటే తప్పక జరుగుతుంది. జరగబోయే దాన్ని ఎవడు ఆపగలడు? .... శ్రీ కృష్ణుడు భగవద్గీతలో అన్ని చేసేది, చేయించేది నేనే, నీవు కేవలం నిమిత్త మాత్రుడవు అని అన్నాడు. పైన అన్నవే నిజమైతే గనుక మన భవితవ్యం అంతా ఎప్పుడో దేవుడు నిర్ధారించేసాడు. మనం కేవలం కీలు బొమ్మలం అని అనిపిస్తుంది. చేసింది, చేస్తోంది మరియు చేయబోయేది అంతా భగవదేచ్చ అయితే మానవుడికి కర్మ ఫలం ఎలా అంటుకుంటుంది? మరి జన్మ జన్మల కర్మ ఫలాలే ఈ సుఖ దుఖాలు ఎలా అవుతాయి? ఈ పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం అనే వాటికి అర్ధం ఏమిటి?
దీనికి సమాధానం యోగ వాశిష్ట్యములో మనకు కనిపిస్తుంది. రామ చంద్రుడు చిన్నతనంలో చాలా తీర్ధయాత్రలు చేసాడు, ఆ క్రమంలో ప్రజల కష్టాలను, దుఖాలను చూసి అత్యంత నిరుత్సాహానికి గురి అయ్యాడు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి, రాముని వెంట పంపమని దశరధుని కోరటం జరుగుతుంది. నిండు సభలో విచారవదనంతో వున్న రాముడిని చూసి విశ్వామిత్రుడు కారణం కోరగా, రాముడు తన బాధకు గల కారణాన్ని వివరిస్తాడు. అప్పుడు వశిష్ట మహర్షి రామునికి బోధించినదే యోగ వాశిష్ట్యము. ఆ బోధలలో నాకు బాగా నచ్చింది "పురుష ప్రయత్నం" గురించి వశిష్టుడు చెప్పిన మాటలు.
మానవుడికి జన్మని ఇచ్చిన భగవంతుడు ఏదైనా ఎలా చేయవచ్చు, ఎలా చేయకూడదో వేదాల ద్వారా తెలియచేసాడు. కాని చేయడమో, చేయకపోవాడమో, ఎలా చెయ్యాలనుకుంటున్నామో నిర్ణయించుకునే స్వేచ్చని (ఫ్రీ విల్) మనకి ఇచ్చాడు. మనం చేసిన పనుల బట్టి, చేసిన విధానం బట్టి మన మంచి చెడ్డలు నిర్ణయిన్చబడుతున్నాయి. కాబట్టి మనం ఏమి చేస్తాం ఎలా చేస్తాం అనేది మన చేతుల్లోనే వుంది.
మానవుడు తన పూర్వ జన్మల ఫలితాన్ని, ఈ జన్మలోకి కూడా మోసుకుని వస్తాడు. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిటిని సాధించలేక పోతాం, మన ప్రారబ్ధం ఇంతే అని సరి పెట్టుకుంటాం. దీనికి కారణం మనం ఇంతకుముందు చేసిన కర్మల ఫలం. కాని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, "మన కర్మల ఫలం మనకి అడ్డంకుల రూపం లో వస్తుంది తప్పితే ఫలితం రూపంలో రాదు". ఫలితం కావాలంటే ఎం చెయ్యాలో అది మన చేతుల్లోనే వుంది, అదే "ప్రయత్నం". వచ్చిన అడ్డంకుల్ని అన్నింటిని అధిగమించిన వాడే విజయం సాధిస్తాడు. మనం సాధారణంగా చేసేది ఏమిటంటే కొంత వరకు ప్రయత్నించి, ఆ పైన మన ప్రారబ్ధం అని వదిలేస్తాం లేదా బాగా కోరిక వుంటే అడ్డ దారులు తొక్కడానికి ప్రయత్నిస్తాం. వదిలేయడం అనేది అలవాటు అయితే మనం ఎప్పుడు ప్రయత్నం చేయం. దాని వల్ల మనం కర్మహీనులుగా మిగిలి ఇంకొంచెం పాపం మూట కట్టుకుంటాం. పైపెచ్చు గత జన్మల పాప ఫలాన్ని పోగొట్టడానికి ఏమీ చేయలేదు కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా అలానే జీవితంలో వొడి పోతూనే వుంటాం. ఒకవేళ పాప కర్మల ద్వారా ఫలితాన్ని సాధిస్తే ఇంకొంచెం ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వుంటుంది.
మనకు అర్ధం అయ్యే భాషలో చెప్పాలి అంటే, పుట్టుకతోనే మనం కొంత "Opening Balance" తో పుడతాం. అది పాజిటివ్ కావచ్చు లేక నెగటివ్ కావచ్చు. నెగటివ్ బాలన్స్ తో వున్నప్పుడు అది +ve లోకి రావాలంటే ముందు -ve ని సున్నా చెయ్యాలి. ఆ -ve పాయింట్స్ మనకి అవరోధాల రూపంలో వస్తాయి. వాటిని సంకేతాలుగా తీసుకుని ప్రయత్న విరమణ చేస్తే, ఫలితం ఎన్నటికి సిద్ధించదు. వాటిని మనం మన కర్మ ఫలాలుగా స్వీకరించి, అర్ధం చేసుకుని, వాటిని ప్రయత్న పూర్వకంగా అధిగమించాలి. అలా చూస్తే అవరోధాల పట్ల మన దృక్ప్రధం మారుతుంది. నిరుత్సాహం కలుగదు.
HOPE THE ABOVE MAKES SOME SENSE